పాత ప్రపంచం

       పాత ప్రపంచం
"ఓల్డ్ వరల్డ్" మ్యాపు (2 వ శతాబ్దపు టోలెమీ ప్రపంచ పటం -15 వ శతాబ్దపు కాపీ)

ఆఫ్రికా, ఆసియా, యూరప్ లను (ఆఫ్రో-యురేషియా లేదా ప్రపంచ ద్వీపం) కలిపి పాత ప్రపంచం (ఓల్డ్ వరల్డ్) అని అంటారు. ఈ పదాన్ని ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో వాడతారు. 'కొత్త ప్రపంచాన్ని' (అమెరికా ఖండాలు, ఓషియానియా) కనుక్కోవడానికి ముందు తమకు తెలిసిన ప్రపంచాన్నంతటినీ వాళ్ళు 'పాత ప్రపంచం' అని పిలిచేవారు.

పద చరిత్ర

పురావస్తు శాస్త్రం, ప్రపంచ చరిత్రల సందర్భంలో, కాంస్య యుగం నుండి (పరోక్ష) సాంస్కృతిక సంబంధం కలిగి ఉన్న ప్రాంతాలన్నీ "పాత ప్రపంచం" అనే పదంలోని భాగమే. ఈ సంబంధం కారణంగా తొలి నాగరికతలు సమాంతరంగా విలసిల్లాయి. ఈ నాగరికతలు ఎక్కువగా సుమారు 45 వ, 25 వ అక్షాంశాల మధ్య ఉన్న సమశీతోష్ణ మండలంలో - మధ్యధరా, మెసొపొటేమియా, పర్షియన్ పీఠభూమి, భారత ఉపఖండం, చైనాల్లో - ఉన్నాయి.

ఈ ప్రాంతాలు సిల్క్ రోడ్ వాణిజ్య మార్గం ద్వారా అనుసంధానమై ఉండేవి. ఈ ప్రాంతాల్లో కాంస్య యుగం ముగిసాక వచ్చిన ఇనుప యుగం బాగా వర్ధిల్లింది. సాంస్కృతిక పరంగా, ఇనుప యుగాన్ని యాక్సియల్ ఏజ్ అని పిలిచేవారు. పాశ్చాత్య (హెలెనిజం, " క్లాసికల్ "), ప్రాచ్య (జొరాస్ట్రియన్, అబ్రహామిక్), దూర ప్రాచ్య (హిందూ మతం, బౌద్ధం, జైనం, కన్ఫ్యూషియనిజం, టావోయిజం) సాంస్కృతిక కేంద్రాలు రూపుదిద్దుకునేందుకు మార్గం వేసిన సాంస్కృతిక, తాత్విక, మతపరమైన పరిణామాలను యాక్సియల్ ఏజ్ అనే పదం సూచిస్తుంది.

చరిత్ర

పాత ప్రపంచంలో మూడు ఖండాలున్నాయనే (ఆసియా, ఆఫ్రికా,ఐరోపా) భావన ప్రాచీన కాలం నాటిది. టోలెమీ, పురాతన కాలం నాటి ఇతర భౌగోళిక శాస్త్రవేత్తలూ దీని సరిహద్దులను నైలు, డాన్ నదుల వెంట గీసారు. ఈ నిర్వచనం మధ్య యుగాలలోను, ప్రారంభ ఆధునిక కాలంలోనూ ప్రాచుర్యంలో ఉండేది.

ఇతర పేర్లు

ఆఫ్రో-యురేషియా ప్రధాన భూభాగాన్ని (బ్రిటిష్ దీవులు, జపాన్, శ్రీలంక, మడగాస్కర్, మలయ్ ద్వీపసమూహం వంటి ద్వీపాలను మినహాయించి) "ప్రపంచ ద్వీపం" అని పిలిచారు. ఈ పదాన్ని సర్ హాల్ఫోర్డ్ జాన్ మాకిండర్ తన ది జియోగ్రాఫిక్ పివట్ ఆఫ్ హిస్టరీ పుస్తకంలో కాయించాడు .

పాత ప్రపంచం లోని కొన్ని సంస్కృతుల్లో ఈ పదానికి సమానమైన పదాలు ఉన్నాయి. జర్మను కాస్మాలజీలో మిడ్‌గార్డ్ అనే పేరుతోను, గ్రీకులు ఓకోమెనే అనే పేరుతోనూ పాత ప్రపంచాన్ని ప్రస్తావించారు.

మూలాలు

  1. "Old World". Merriam-Webster Dictionary. Archived from the original on 2 April 2019. Retrieved 3 December 2014.
  2. "New world". Merriam-Webster Dictionary. Archived from the original on 2 April 2019. Retrieved 2 April 2013.
  3. See Francis P. Sempa, "Mackinder's World." Archived 2016-03-03 at the Wayback Machine American Diplomacy (UNC.edu). Retrieved 2018-09-08.